బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని వయాకామ్ 18 పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై అమీర్ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మన అక్కినేని వారసుడు నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రం ఆధారంగా దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి డిజాస్టర్ తరువాత అమీర్.. దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకుని ఎంతో ఇష్టంగా ‘లాల్ సింగ్ చడ్డా’ ను తెరకెక్కించారు. స్వతహాగా సినిమా పబ్లిసిటీ అంటే అమీర్ చాలా విస్తృత స్థాయిలో చేస్తారు. లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఇంకా భారీ స్థాయిలో ప్రచారం చేశారు. తెలుగులో నాగ చైతన్య తెలిసిన హీరో అవడంతో ఇక్కడకి వచ్చి మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జునతో ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా నిర్వహించారు. అంతే కాక ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు.
అమీర్ ఖాన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసినా . చివరికి లాల్ సింగ్ చడ్డా ఆయనకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇందుకు కారణం ఈ సినిమాకు మొదటి నుంచీ హిందీ ప్రేక్షకుల్లో సరైన అసక్తి లేకపోవడమే. అమీర్ ఖాన్ నుండి ఎప్పుడో హాలీవుడ్ లో వచ్చిన సినిమా రీమేక్ అనగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. దానికి తోడు పాటలు, ట్రైలర్ ఏవీ కూడా అంతగా ప్రేక్షకులని ఆకట్టు కోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఈ చిత్రానికి మరో దెబ్బ బాయ్ కాట్ నినాదాలు.
థియేటర్ల వద్ద ప్రేక్షకులు సరైన రీతిలో రాని కారణంగా కొన్ని షోలని రద్దు చేయాల్సి వచ్చిందంటే ఈ సినిమా ఎంతటి దారుణమైన ఫలితాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లలో దాదాపు సగం రాబట్టింది..బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.
అయితే ఓవర్సీస్ లో మాత్రం లాల్ సింగ్ చడ్డా బాగానే వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్ సింగ్ చడ్డా’ సరికొత్త రికార్డుని తన సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో 7.5 మిలియన్ డాలర్ల వరకూ వసులు చేసి ఇప్పటి దాకా ప్రథమ స్థానంలో ఉన్న ‘గంగూబాయి కతియావాడి’ (7.47 మిలియన్ డాలర్స్) రెండవ స్థానంలో ఉన్న ‘భూల్ భూలయ్యా 2 (5.88 మిలియన్ డాలర్స్) దాటేసింది.
ఆ రకంగా భారత దేశ వ్యాప్తంగా భారీ డిజాస్టర్ గా నిలిచిన ‘లాల్ సింగ్ చడ్డా’.. విదేశాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవటం చిత్ర నిర్మాతలకు కాస్త ప్రశాంతతను ఇస్తుంది. ఖచ్చితంగా లాల్ సింగ్ చడ్డా ఓవర్సీస్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.