ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ సాయి పల్లవి ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాని శేఖర్ కమ్మల తెరకెక్కించారు. ఆ సినిమాలో సాయి పల్లవి నటన, డ్యాన్స్ కి ఆడియన్స్ నుండి విశేషమైన క్రేజ్ లభించింది. ఇక అక్కడి నుండి వరుసగా మంచి అవకాశాలు అందుకున్న సాయి పల్లవి ప్రతి సినిమాలో కూడా తనదైనటువంటి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అలరిస్తూ ఎంతో సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు.
ఇక తాజాగా శివ కార్తికేయన్ హీరోగా మేజర్ ముకుంద్ వారాధరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమాలో ముకుంద్ భార్య రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించారు సాయి పల్లవి. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీని రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. హిట్ టాక్ తో మంచి కలెక్షన్ తో ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ముఖ్యంగా సాయి పల్లవి చేసిన పాత్రకి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి విశేషమైనటువంటి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. కెప్టెన్ ముకుంద్ యొక్క జీవితానికి సంబంధించిన కథను వివరిస్తూ ఆమె పాత్ర సాగడం, అతని జీవితంలోకి ఆమె ఎంట్రీ, కుటుంబ జీవితం వంటి సీన్స్ లో సాయి పల్లవి హృద్యంగా నటించారు. ఇక పలు యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి పల్లవి నటనకు ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. హార్ట్ టచ్చింగ్ యాక్టింగ్ తో పాటు అన్ని వర్గాల్లో కూడా సాయి పల్లవి నటిగా ఈ సినిమాతో మరొక మెట్టెక్కారని చెప్పాలి. ప్రస్తుతం అమరన్ మూవీ తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.