ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో సెలబ్రిటీలకు, సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వ్యక్తులకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.. అలాగే ఏదో హీరో లేదా పాపులర్ వ్యక్తులు ఒక సాధారణ ట్వీట్ లేదా పోస్ట్ వేసినా కూడా వాటి పై నెటిజన్లు రాద్ధాంతం చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. నటీనటుల అభిమానులు తమ పిచ్చి ఆలోచనలతో అనవసర తగాదాలకు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అభిమానుల మధ్య గొడవకు దారి తీసింది.
ఇటీవల, అల్లు అర్జున్ ట్విట్టర్ లోని తన అకౌంట్ లో తన తాతగారైన స్వర్గీయ శ్రీ అల్లూరి రామలింగయ్య గారిని గుర్తు చేసుకుంటూ.. ” మా పునాది” అని ట్వీట్ చేశారు. అమాయకంగా మరియు హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్న ఈ పోస్ట్ ను చాలా మంది చక్కని ప్రేమకు చిహ్నంగా భావించారు. అయితే అదే ట్వీట్ ఒక వర్గం వారికి మాత్రం సుతరామూ నచ్చలేదు.
ఈ ట్వీట్ పై మెగా ఫ్యామిలీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్‌లో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ అభిమానులు సదరు ట్వీట్ కు చాలా ఆనందంగా ఉన్నారు. అంతే కాకుండా ‘మెగా’ ట్యాగ్‌కు బదులుగా ‘అల్లు’ ట్యాగ్ ను వేయడం పై ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు, మెగా ఫ్యామిలీ మరియు మెగా అభిమానులు వెన్నంటి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అల్లు అర్జున్ స్టార్‌డమ్ సాధించారని, ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ అంటూ వచ్చేశాక వారి నుండి విడిపోయి తన ‘అల్లు’ బ్రాండ్‌ను కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెగా అభిమానులు వాదించారు. ఆయన ఇటీవల మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా హాజరు కావడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ వాదనలలో భాగంగానే ఒక ట్విట్టర్ మెగా ఫ్యాన్ చిరంజీవి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఆయనే పిల్లర్ అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కి కౌంటర్‌గా అల్లు అర్జున్ అభిమాని ఒకరు పునాది వేసిన తర్వాతే స్తంభాన్ని నిర్మిస్తారు అంటూ బదులు ఇవ్వడం గమనార్హం.
ఫ్యాన్స్ వార్ అనేది సోషల్ మీడియాలో మామూలే కానీ ఇలా ఓకే కుటుంబ సభ్యుల మధ్య ఫ్యాన్స్ వార్ తారాస్థాయికి చేరుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అయినా కేవలం ఒకరు సహాయం చేస్తేనే ఎవరూ పైకి వచ్చేయరు. స్వతహాగా తమలో ప్రతిభ ఉంటేనే అభివృద్ధి చెందుతారు. ఆ విషయాన్ని గ్రహించి ఇరువురి అభిమానులు ఇలాంటి పనికిమాలిన గొడవలు మానేస్తే మంచిది.