తాజాగా వినిపిస్తున్న వార్తలు నిజమైతే అల్లు అర్జున్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ యొక్క తదుపరి చిత్రం ‘జవాన్’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ వార్త తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
ఇటీవలే పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం జవాన్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాది జూన్ లో విడుదల కానున్న ఈ సినిమా షారుఖ్ ఖాన్ కు తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక చిన్న అతిధి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పేర్లతో పాటు దళపతి విజయ్ కూడా ఒక అద్భుతమైన క్యామియోలో నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వార్త ఇంకా ఖరారు కాలేదు.
ఈ నటీనటులంతా ఉన్నారు అనే విషయం అటు షారుఖ్ ఖాన్ అభిమానులతో పాటు యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులలో తారాస్థాయిలో ఉత్సాహాన్ని పెంచితే, తాజాగా పుష్ప స్టార్ కు సంబంధించిన ఈ వార్త మొత్తం హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి.
ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియో కోసం అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సంప్రదించారని, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులని అలరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అందుకు ఇంకా ఓకే చెప్పలేదు కానీ ఈ ఛాన్స్ కి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భోగట్టా.
అల్లు అర్జున్ అభిమానులు, నెటిజన్లు ఇప్పటికే ఈ వార్త విని సినిమా కోసం తమ స్టోరీలు రాయడం ప్రారంభించారు .ఐకాన్ స్టార్ యొక్క ఈ క్యామియో ఒక చిన్న ఎపిసోడ్ కోసం ఉంటుందా లేదా ఒక పాటలో కనిపిస్తారా అని వారు ఆలోచిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కోసం అట్లీ అంత ప్రత్యేకంగా ఏం సిద్ధం చేశారో ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.