అల్లు అరవింద్, దిల్ రాజు.. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలైన వీరి పేర్లు ఇటీవల ఓ సినిమా విషయంలో ఓ డ్రామాతో వార్తల్లో నిలిచాయి. నిన్న ఉదయం నుంచి అల్లు అరవింద్ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది.
దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండతో తన సినిమాను ప్రకటించిన పరశురామ్ పై అల్లు అరవింద్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గీత గోవిందం సీక్వెల్ ను డైరెక్ట్ చేయడానికి అల్లు అరవింద్ నుంచి ఈ దర్శకుడు భారీ మొత్తాన్ని తీసుకున్నారని అంటున్నారు.
దిల్ రాజు-పరశురామ్-విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్మెంట్ రానుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ వార్తతో అల్లు అరవింద్ మరియు ఆయన బృందం హర్ట్ అయ్యిందని, దిల్ రాజును సంప్రదించగా ఆ వార్తల్లో నిజం లేదని ఆయన ఆ వార్తలను తోసిపుచ్చారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆదివారం రాత్రి జరిగింది.
దిల్ రాజు తనకు అత్యంత సన్నిహితుడు అయి ఉండి తనతో ఇలా చేశాడంటే నమ్మలేకపోయారని, ఇచ్చిన మాట పై నిలబడని పరశురామ్ పై అల్లు అరవింద్ లీగల్ యాక్షన్ తీసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.
నిన్న ఈ వివాదానికి సంబంధించి చాలా ఇన్ సైడ్ లీకులు, కథనాలు వచ్చాయి. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు, పరశురామ్ లను తిడతారని కూడా వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్ మీట్ చూసేందుకు రెడీ అయిన నెటిజన్లు ఈ మొత్తం వ్యవహారం పై అరవింద్ ఏం చెబుతారని ఎదురు చూశారు.
అయితే చివరి నిమిషంలో ప్రెస్ మీట్ క్యాన్సిల్ కావడం అందరినీ నిరాశకు గురి చేసింది. ఇరువర్గాలకు తెలిసిన కొందరు వ్యక్తులు మధ్యవర్తిత్వం వహించడంతో వారు సమస్యను పరిష్కరించుకున్నారని చెబుతున్నారు. పైగా ఛాంబర్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇండస్ట్రీలో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం మంచిది కాదనే నిర్ణయానికి మరో కారణంగా చెబుతున్నారు