అన్‌స్టాపబుల్ షో అల్లు వారి ఆహా ప్లాట్ ఫామ్ కు భారీ విజయాన్ని అందించింది మరియు ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్ కి కూడా ఒక గేమ్ ఛేంజర్‌లా నిరూపించబడింది. షోలో ఇంతవరకు ఎవరూ చూడని బాలకృష్ణ లోని ఫన్నీ సైడ్‌ని ప్రేక్షకులు ఇష్టపడటంతో ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
అంతే కాకుండా అన్‌స్టాపబుల్ షో ద్వారా అల్లు అరవింద్ – బాలకృష్ణ మధ్య స్నేహం కూడా బాగా బలపడి మరో స్థాయికి వెళ్ళింది. బాలకృష్ణతో సినిమా చేయాలని అల్లు అరవింద్ చాలా కాలంగా అనుకున్నా ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు, ఎట్టకేలకు ఇప్పుడు వారి కలయికలో ఓ సినిమా రాబోతుంది.
ఇటీవలే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ పాల్గొన్న విషయం తెలిసిందే. అల్లు ఫ్యామిలీ జరిపిన ఈ వేడుకకు బాలకృష్ణ హాజరవడం అందరికి చాలా ఆనందంగా అనిపించింది, ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆ ఈవెంట్ చూసిన వారందరూ ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా తన తాజా చిత్రం సర్కారు వారి పాటతో విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్.. బాలకృష్ణతో తాను ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ నాగ చైతన్యతో సినిమా ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. గత కొన్నాళ్లుగా బాలకృష్ణకు సరిగ్గా సరిపోయే కథను సిద్ధం చేసే పనిలో కూడా ఉన్నారు పరశురామ్. గీతా ఆర్ట్స్ టీమ్ తో కలిసి బాలకృష్ణ కోసం పరశురామ్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాలకృష్ణ స్క్రిప్ట్‌ను వింటారని పరశురామ్ స్వయంగా ప్రకటించారు.
మొత్తానికి బాలకృష్ణ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ ఓ భారీ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించబోతున్నట్లు దాదాపుగా ఖరారు అయింది. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనునట్లు తెలుస్తోంది.
ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానుంది. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించే చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.