అల్లరి నరేష్ కొత్త సినిమా ఉగ్రం ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఆయన అదిరిపోయే మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించే నరేష్.. నాంది సినిమా విజయం తర్వాత తన పంథాను మార్చుకుని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
నాందిలో అల్లరి నరేష్ ను పూర్తిగా కొత్త పాత్రలో చూపించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రంలో ఇంతకు ముందెన్నడూ ఆయనను మనం చూడని పాత్రలో నటింపజేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను హింసాత్మక విధంగా చూపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇందులో ఒక సీరియస్ ఇష్యూను డీల్ చేసినట్లు తెలుస్తోంది.
వివిధ వయసుల వారు కనిపించకుండా పోయారని కంప్లైంట్ లు వస్తుంటాయి, ఇందులో పెద్ద మాఫియా నెట్ వర్క్ ఉందని ఓ పోలీసు తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అలా చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అది అనుకున్నంత సులభం కాదు, ఎందుకంటే అతని చిత్తశుద్ధి కారణంగా అతని కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. అయితే, అతను భయపడకుండా మరింత దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తన మిషన్ లో సక్సెస్ అయ్యాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం పూర్తి సినిమాలో ఉంటుంది.
షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మిర్నా హీరోయిన్ గా నటించారు. అబ్బూరి రవి మాటలు రాయగా, తూం వెంకట్ కథ అందించారు. 2023 మే 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అల్లరి నరేష్ మేకోవర్ ఈ సినిమాతో ఆయనకి మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.