తెలుగు సినీ పరిశ్రమలో హిట్ కాంబినేషన్ ఏమీ కొత్త కాదు.ప్లాప్స్ లో ఉన్న హీరోలకు హిట్ వస్తే ఆ దర్శకులతో కలిసి మళ్ళీ పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతారు.అలాంటి క్రేజీ కాంబినేషనే మళ్లీ కలిసి పనిచేయబోతోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అల్లరి నరేష్ కు ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ లభించింది. ఈ సినిమాని విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. చేయని తప్పుకి శిక్ష అనుభవించే ఓ అమాయకుడు తిరగబడితే ఎలా వుంటుందనే ఆసక్తికరమైన కథ కథనాలతో రూపొందించిన ఆ సినిమా చాలా రోజులకు అల్లరి నరేష్ కు హిట్ ను తెచ్చిపెట్టింది.నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని చూపిస్తూ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది నాంది సినిమా.
ప్రస్తుతం ‘సభకు నమస్కారం’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్న అల్లరి నరేష్ హీరోగా మళ్లీ స్పీడు పెంచారు.ఇదిలా వుండగా పైన చెప్పుకున్నట్టు నాంది కాంబినేషన్ ను రిపీట్ చేయనున్నారు. “నాంది”సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న అల్లరి నరేష్ విజయ్ కనకమేడల మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు.
కృష్ణార్జున యుద్ధం,మజిలీ,గాలి సంపత్, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ద నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా సోమవారం ప్రకటించింది.ఏ షాడో ఆఫ్ హోప్’ పేరుతో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. విజయ్ కనకమేడల అల్లరి నరేష్ 2 అంటూ విడుదల చేసిన పోస్టర్ పై బేడీలు వేసిన చేతులు జత చేయగా షాడోలో ‘డేగ’ సింబల్ కనిపిస్తోంది.
ఈ సినిమాని పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందబోతుందని, అల్లరి నరేష్ ను ఇంతకు మునుపెన్నడూ చూడని యాక్షన్ హీరోగా మరియు ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడు అని చిత్ర బృందం తెలిపింది.ఖచ్చితంగా ఈ హిట్ కాంబినేషన్ మరోసారి హిట్ కొడతారని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం నరేష్ నటిస్తున్న ‘సభకు నమస్కారం’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాల తరువాత ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ని పట్టాలెక్కిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.