టాలీవుడ్ సీనియర్ నటుడు కళాప్రపూర్ణ మంచు మోహన్ బాబు ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజలుగా ఆయన కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తనను చంపుతాను అని చిన్న కొడుకు మంచు మనోజ్ బెదిరిస్తున్నాడని, తనకు పోలీసు రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులని ఆశ్రయించారు.
మరోవైపు తనని మరియు తన భార్య ని తండ్రి కావాలని ఇరికిస్తున్నారని మంచు మనోజ్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసారు, ఆపై తండ్రి పై కేసు పెట్టారు. అయితే ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరి వివాదం మూడు రోజులుగా విపరీతంగా సాగుతుండడంతో మీడియా కూడా దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో మోహన్ బాబు ఇంటికి వెళ్లిన కొందరు మీడియా వారిపై మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. కాగా ఒక ప్రముఖ తెలుగు టివి ఛానల్ జర్నలిస్టుకి తీవ్ర గాయం అవడంతో ఆ ఛానెల్ ఉద్యోగి మోహన్ బాబు పై కేసు పెట్టారు.
అయితే ఈ హత్యయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన అరెస్టు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. హత్యాయత్నం కేసు కావడంతో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా కనిపించడం లేదని పోలీసు వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.