ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ హీరో ఖిలాడి అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన ఫ్యామిలీ డ్రామా రక్షా బంధన్ ఆగష్టు 11న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా అదేరోజు మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కపూర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడింది. అయితే ఈ రెండు చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుంచి మరియు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
రక్షా బంధన్ సినిమాకి కాస్త మంచి రివ్యూలు వచ్చినా, బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ట్రైలర్, పాటలు చూసి ప్రేక్షకులు ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశించి థియేటర్లకు తరలి వెళ్ళారు. ఐతే ఫస్టాప్ పరవాలేదు అనిపించినా, సెకండాఫ్ లో వేరే సినిమా తీసిన విధంగా కథ పక్కదారి పట్టడం ప్రేక్షకులకి అస్సలు నచ్చలేదు.
ఇక ఈ సినిమా పై బాయ్కాట్ ట్రెండ్ కూడా పని చేసిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ అంతర్గత వర్గాలు కూడా భావించాయి. కోవిడ్ దాడుల దెబ్బకి దాదాపు రెండేళ్లు ధియేటర్లలో బాలివుడ్ ప్రేక్షకుల సినిమా చూసే అలవాటు తప్పిందని, ఒటిటి ఎదుగుదలకి తోడు సౌత్ సినిమాల రుచి చూసిన ప్రేక్షకులకి బాలీవుడ్ హీరోలు మరీ సాధారణ సినిమాలు అందించడం ఏమాత్రం నచ్చటం లేదని, అందుకే అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో నటించిన రక్షా బంధన్ సినిమాకు కనీస స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదని ఒక వాదన వినిపిస్తోంది.
ఇక ఈ మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఏ భాషలో వచ్చిన సినిమా అయినా, థియేటర్లో ఆ సినిమా ఫలితం ఎలాంటిది అయినా ఆ చిత్రాన్ని ఓటిటి విడుదల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఏర్పడ్డారు.
అలాంటి ప్రేక్షకులతో పాటు రక్షా బంధన్ సినిమాని థియేటర్లలో చూడలేకపోయిన వారి కోసం, ఈ చిత్రం త్వరలో OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో ప్రసారం చేయబడుతుంది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న OTT ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది.
స్ట్రీమింగ్ దిగ్గజం అయిన ZEE5, శనివారం అక్టోబర్ 1న తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.