బాలీవుడ్ లో టాప్ 1 స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్ ఎన్నో ఘనవిజయాలతో గత 3 దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ బాలీవుడ్ స్టార్ కు గడ్డుకాలం ఎదురైంది. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, కట్ పుట్లీ (ఓటీటీ రిలీజ్), రామ్ సేతు, సెల్ఫీ వంటి పలు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా విఫలం అయ్యాయి.
ఈ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ రాకపోవడం, థియేట్రికల్ పరంగా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో అక్షయ్ తో సినిమా అంటే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు లెక్కలు చూసుకోక తప్పడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్షయ్ కుమార్ స్థాయి స్టార్ కు చాలా షాకింగ్ గా ఉన్నాయి, అలాగే డే 1 మరియు క్లోజింగ్ కలెక్షన్స్ కూడా అంతే తీసికట్టుగా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో అక్షయ్ కి సరైన హిట్ లేకపోవడంతో నిర్మాతలు కూడా ఆయన సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు. అందుకే ఆయన తాజాగా నటించిన ఓ మై గాడ్ 2 సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఓ మై గాడ్ మొదటి భాగం మంచి కలెక్షన్లతో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. కాబట్టి దాని సీక్వెల్ ఇలా ఓటీటీలో విడుదల కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
అక్షయ్ గత ఏడాది 6 సినిమాలు (5 థియేట్రికల్, 1 ఓటీటీ) విడుదల కాగా, ఏ సినిమా కూడా డీసెంట్ కలెక్షన్లు రాబట్టలేక భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా) రీమేక్ తో అయినా అక్షయ్ కుమార్ బలమైన పునరాగమనం ఇస్తారని ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.