నిన్న రాత్రి హైదరాబాద్ లో వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ కార్యక్రమం జరగగా.. హీరో బాలకృష్ణ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఓ వింత ప్రకటన చేయగా, ఇప్పుడు ఆయనకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
” మా నాన్న ఎన్టీఆర్ కు సమకాలికులుగా నటులు రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ), అక్కినేని, తొక్కినేని, మరికొందరు ఉండేవారు’ అని బాలకృష్ణ అన్నారు.
అక్కినేని కుటుంబం పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఏమాత్రం రుచించలేదు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు వంటి మహానుభావుడిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను వారి తప్పుపడుతున్నారు.
కాగా కేవలం అక్కినేని అభిమానులే కాకుండా ఇతర అభిమానులు, నెటిజన్లు కూడా బాలకృష్ణ ఈ కార్యక్రమంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదంపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే బాలకృష్ణకు నాగేశ్వరరావు గారు అంటే చాలా గౌరవం అని, ఆయనను తండ్రి సమానంగా కూడా చూస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు అనాలోచితంగా వచ్చాయని, అక్కినేని పదాన్ని ప్రాస చేయడానికి ప్రయత్నించడం వల్లనే అలా పొరపాటున నాలుక జారిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, నిన్న రాత్రి వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి, అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ప్రత్యేక అతిథులుగా హాజరై ఫుల్ ఎనర్జీతో ఈ కార్యక్రమం సాగింది.