అక్కినేని నాగచైతన్య, ఆయన సోదరుడు అఖిల్ అక్కినేని హీరోలుగా కస్టడీ మరియు ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని సోదరులకు ఇది చాలా కీలకమైన సమయం కావడంతో ఇప్పుడు ఈ ఇద్దరూ హిట్ అందుకోవడంలో సక్సెస్ అవుతారా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. తమ సినిమాలకు బజ్ పెంచేందుకు ఈ ఇద్దరు అక్కినేని వారసులు కలిసి ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారని తెలియవచ్చింది.
కొద్ది రోజుల క్రితం నాని, రవితేజ ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దసరా, రావణాసుర సినిమాలను కలిసి ప్రమోట్ చేశారు. ఇప్పుడు అఖిల్ అక్కినేని ఏజెంట్, నాగచైతన్య కస్టడీ సినిమాలు రెండు వారాల చిన్న గ్యాప్ తో రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ బ్రదర్స్ కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాగచైతన్య, అఖిల్ ల ఈ ప్రమోషనల్ ఐడియా వర్కవుట్ అవుతుందని ఆశిద్దాం.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఏజెంట్ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేయగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.