అక్కినేని వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అఖిల్. కెరీర్ పరంగా భారీ విజయాలు సాధించి తన మార్క్ చూపించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ యువ హీరో మరికొద్ది రోజుల్లో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా చేంజ్ చేసుకొని సిక్స్ పాక్ తెచ్చుకున్నారు అఖిల్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఈ ఏజెంట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్ నుంచి వదిలిన అఖిల్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే స్పెషల్ సినిమా అవుతుందని అటు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.
తొలుత ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేసినా షూటింగ్ లో కొంత ఆలస్యం మరియు ఇతర సినిమాల వల్ల ఇప్పుడు దసరాకి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు కేవలం ఆంధ్ర ఏరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని, ఈ సినిమా హక్కుల కోసం పలు బడా కంపెనీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు.తొలి చిత్రం తోనే అఖిల్ రికార్డు ఓపెనింగ్స్ సాధించినా ఆ సినిమాతో పాటు తరువాత విడుదల అయిన మిస్టర్ మజ్ను, హలో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.
ఆ ఫలితాల వల్ల అఖిల్ నిరాశ పడ్డా ఇప్పుడు ఏజెంట్ సినిమాకు మాత్రం మొదలైన దగ్గరనుంచి అన్నీ పక్కాగా కుదిరి ప్రేక్షకులలో మంచి బజ్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ బిజినెస్ పరంగా భారీ అంచనాలు రావడానికి కారణం హీరో అఖిల్ అనే చెప్పాలి. మరే యువ హీరో ఈ సినిమా చేసినా ఈ క్రేజ్ ఏజెంట్ సినిమాకు వచ్చేది కాదు. ఆ క్రేజ్ ను ఈసారైనా సరిగ్గా ఉపయోగించుకుని అఖిల్ భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూద్దాం.