సినిమా హీరోల పై వారి అభిమానులు చూపించే అభిమానానికి అంతే ఉండదు. తమకు సాధ్యమైన ప్రతి రీతిలో అభిమానాన్ని ఎంతో ఇష్టంగా చాటుకుంటూ ఉంటారు. అందులో బాగంగానే హీరోల పుట్టిన రోజు నాడు వారు నటించి, తమను ఎంతగానో అలరించిన బ్లాక్ బస్టర్ సినిమాలని రీ రిలీజ్ చేసి.. 4కెలో కి కన్వర్ట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ కొన్నిటికి వారు అనుకున్నది సాధిస్తారు కూడా. ఇటీవల ఈ డిమాండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి`తో మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా 2006లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `పోకిరి`ని 4కెలోని కన్వర్ట్ చేసి ఆగస్టు 9న రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మొత్తం 360 థియేటర్లలో విడుదల చేయడం విశేషం.
విడుదలైన ప్రతీ థియేటర్ లోనూ `పోకిరి` ప్రతీ షో హౌస్ ఫుల్స్ నమోదు చేసి ఒక్కసారిగా అందరినీ పోకిరి ఫస్ట్ డే ఫస్ట్ షో తాలూకు జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్లేలా చేశారు మహేష్ అభిమానులు. అంతే కాకుండా థియేటర్లలో వారి హంగామాతో నింపేశారు. ఈ హంగామా చూసిన మిగతా హీరోల అభిమానులు తాము మాత్రం ఏం తక్కువ కాకూడదనే ఉద్దేశంతో తమ హీరోల సినిమాలను కూడా రిమాస్టర్ చేయాలని ఆయా నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫేవరేట్ సినిమాని కూడా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి.. తమ తడాఖాను.చూపించాలి అని వారి తాపత్రయం.
ఇటీవల మహేష్ `పోకిరి` 4కె ప్రింట్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు `జల్సా’ సినిమాని పవన్ కల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయాలని గీతా ఆర్ట్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశారట. ముందుగా వారి కోరిక తీరేలా కనిపించలేదు కానీ.. గీతా ఆర్ట్స్ వర్గాలు తాజాగా అభిమానుల డిమాండ్ ను నెరవేర్చే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రింట్ సిద్ధంగా ఉందని.. దాన్ని 4కెలోకి మార్చే పనుల్లో ఉన్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతి ఏటా ఆయన అభిమానులు సెప్టెంబర్ 2న ఘనంగా జరిపే విషయం తెలిసిందే. అదే రోజున వాళ్ళు `పోకిరి` సినిమాకు మహేష్ అభిమానులు చేసిన హంగామాకు ధీటుగా `జల్సా` 4కె ప్రింట్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేసి తమ సత్తా చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ రంగంలోకి దిగితే ఆ పని ఏమంత కష్టం కాదు. ఇప్పటికే 4కె పనులు ప్రారంభించారట. ప్రత్యేక షోలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే గీతా ఆర్ట్స్ వర్గాలు వెల్లడించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు జరపడం మొదలు పెట్టేశారట. ఇక థియేటర్లలో `జల్సా`ని ఏ స్థాయిలో వేడుకలా చేస్తారో.. తాము కూడా ధియేటర్లు దద్దరిల్లే తరహాలో హంగామా చేస్తారా లేదా తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకూ ఆగక తప్పదు.