ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ 2 ఓటీటీలో విడుదల అయింది. అడివి శేష్ నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ ఓటీటీలో ఈరోజే విడుదల అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదలైంది. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించారు.
రావు రమేష్, కోమలి ప్రసాద్, సుహాస్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. హిట్ 2 ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హిట్ 2 ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
కాగా ఇప్పుడు హిట్ 2 అమెజాన్ ప్రైమ్ లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాని చూడాలనుకునే వారు రూ.129 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెజాన్ కు సబ్ స్క్రైబ్ అయిన వారికి కూడా ఈ అద్దె తప్పనిసరి. జనవరి 6 నుండి ఇది సాధారణ చందాదారులకు కూడా అందుబాటులోకి వస్తుంది.
అడివి శేష్ ఈ చిత్రంలో నేరస్థులను ఎగతాళి చేసే మరియు వారిని కోడి బుర్రలు అని పిలిచే ఒక పొగరు ఉన్న పోలీసు అధికారిగా కనిపించారు. కాని ఒక క్రూరమైన హత్య కేసు అతన్ని సవాలు చేస్తుంది. ఒక అమ్మాయి హత్య కేసు దర్యాప్తుగా ప్రారంభమైన కేసు ఆ తర్వాత నలుగురు అమ్మాయిల వరుస హత్యల కేసుగా మారుతుంది.
అసలు హంతకుడు ఎవరు మరియు అతను ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతను ఆ అమ్మాయిలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు, మరియు హీరో నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మూడేళ్ల క్రితం విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ విడుదలైంది. నాని ఈ చిత్రాన్ని సమర్పించారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. మరోసారి అదే కాంబినేషన్ లో హిట్ 2 సినిమా వచ్చింది.
ఇక ఈ ఏడాది హిట్ ౩ రాబోతోందని దర్శకుడు హిట్ 2 సినిమా చివర్లో సూచించారు. నాని హీరోగా నటిస్తున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ లో అడివి శేష్, విశ్వక్ సేన్ కూడా వారి పాత్రల్లో కొనసాగుతారు.