కేవలం ప్రభాస్ అభిమానులే కాక, ఇతర తెలుగు ప్రేక్షకులతో పాటు భారత దేశ సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆది పురుష్`. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ఆది పురుష్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా VFX వర్క్ కోసం చాలా సమయం తీసుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అవుతుందన్న వార్తలు విని ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆనందించారు.
కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు. టి. సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ , 3డీ ఫార్మాట్ లలో రూపొందించారు. విజువల్ వండర్ గా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రిలీజ్ చిత్ర బృందం విడుదల చేసింది.
అయితే ఆది పురుష్ టీజర్ అందరినీ షాక్ కు గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా చిత్రం పూర్తి యానిమేషన్ తో, పేలవమైన VFX వర్క్ తో ఉండి భారీగా నిరాశపరిచింది. టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి 500 కోట్ల పైన బడ్జెట్ ఖర్చు పెట్టారా అని ఆశ్చర్యపోయారు. అదంతా ఉట్టి హైప్ అని, అసలు ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ చిత్రంగా కనిపిస్తుందని పలు బాలీవుడ్ విమర్శకులతో పాటు నెటిజన్లు కూడా అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేందుకు అన్ని రకాల అంశాలను కలిగి ఉంది, ఎందుకంటే పిల్లలు మరియు ఫ్యామిలీస్ కు ఎంతో ఇష్టమైన జానర్ కాబట్టి వారు ఖచ్చితంగా ఆది పురుష్ సినిమా పై ఆసక్తి చూపుతారు. కానీ ఇలాంటి గ్రాఫిక్స్ ప్రధాన సినిమాల వల్ల నటీనటులకు పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పవచ్చు.
ఆది పురుష్ సినిమాని ఐమ్యాక్స్ వెర్షన్ తో పాటు 3డీ వెర్షన్ లోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే టీజర్ కు వచ్చిన మిశ్రమ స్పందన నేపథ్యంలో.. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగించాలంటే చిత్ర బృందం మరింత కష్టపడాల్సి ఉంటుంది.
ఆది పురుష్ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి విమర్శలను తిప్పి కొట్టేలా రాబోయే రోజుల్లో చిత్ర బృందం మెరుగైన కంటెంట్ తో వస్తారని ఆశిద్దాం.