వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ నటించిన తాజా ద్విభాషా చిత్రం సార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా సార్ యొక్క కలెక్షన్లు, వాస్తవానికి, వాతి (తమిళ వెర్షన్)ని అనేక ప్రాంతాలలో అధిగమించాయి. ఈ సినిమా విడుదలైన రెండవ రోజు వసూళ్లు మొదటి రోజు కలెక్షన్‌తో సమానంగా ఉన్నాయి, అలాగే ఇప్పటికే అనేక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది.
ధనుష్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ మరియు జివి ప్రకాష్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకర్షించడంలో సినిమాకు బాగా సహాయపడ్డాయి. ఒక చక్కని సందేశానికి భావోద్వేగ సన్నివేశాలతో పాటు చక్కని డైలాగులు, నటీనటుల నటన రంగరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయింది.
ఈ చిత్రం ధనుష్ నటనకి ప్రత్యేక ప్రశంసలను తెచ్చిపెట్టింది మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఉపాధ్యాయురాలిగా ఆమె పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పాత్ర గురించి నటి మాట్లాడుతూ, సినిమా విడుదలకు ముందు, ఒక జర్నలిస్ట్ తన పాత్ర ఎంపికను ప్రశ్నించారని మరియు గ్లామర్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు స్కోప్ లేనప్పుడు ఈ చిత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారని అడిగారని తెలిపారు.
కాగా సక్సెస్ మీట్ లో ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందని తాను ఇప్పుడు ఆశిస్తున్నాను అని సంయుక్త చెప్పారు. తన పాత్ర డి-గ్లామ్‌గా ఉన్నప్పటికీ, ఈ చిత్రం మాత్రం ఖచ్చితంగా మంచి కమర్షియల్ ఎలిమెంట్‌లను కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాదాపు రూ.18 కోట్లు కాగా ఇప్పటికే ఆ మార్కును అందుకుని దాదాపు అన్ని ఏరియాల్లో లాభాలను సంపాదిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.