బాలీవుడ్ సర్కిల్స్ నుండి అందుతున్న ఇన్ సైడ్ రిపోర్ట్స్ ను బట్టి హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి డేట్ ఓ బాలీవుడ్ హీరోతో ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఆ లక్కీ బాయ్ మరెవరో కాదు యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అని తెలుస్తోంది.
బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి పలుమార్లు బహిరంగంగా కనిపించినప్పటి నుంచి వీరి పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం తమ రిలేషన్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ‘షేర్షా’ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాజస్థాన్లోని జైసల్మేర్లో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిబ్రవరి 6న సూర్యగఢ్ హోటల్లో కి కియారా – సిద్ధార్థ్ ల వివాహం జరగనుండగా, ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయట. షాహిద్ కపూర్, మీరా కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్ వంటి సెలబ్రిటీలతో పాటు సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం.
గత ఏడాది కరణ్ జోహార్ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న కియారా సిద్ధార్థ్ తో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ నేను ఖండించడం లేదా అంగీకరించడం లేదు అని అన్నారు. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని కూడా అన్నారు.
తన రిలేషన్షిప్ గురించి ఆమె మాట్లాడిన తర్వాత ఆ సమయంలో తన వెంట వచ్చిన షాహిద్ అందుకుని “ఈ ఏడాది చివర్లో పెద్ద ప్రకటనకు సిద్ధంగా ఉండండి, అది సినిమా గురించి కాదు” అని అన్నారు.
ఇదిలా ఉంటే కియారా కార్తీక్ ఆర్యన్ జంటగా ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 29, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు సిద్ధార్థ్ త్వరలో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ అరంగేట్రం చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి కుంద్రా ప్రధాన పాత్రల్లో నటించగా, ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్క్లుజీవ్ గా స్ట్రీమింగ్ కానుంది.