బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా నటిస్తుందని ఇంతకు ముందే చెప్పారు. ఇక ఇప్పుడు ఆయన సరసన ఒక హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఆయనకు జోడీగా మాజీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 6 నెలల పాటు సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ కెరీర్ లోకి రీఎంట్రీ ఇస్తూ ఇప్పటికే ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వంటి సమకాలీకులతో కలిసి నటించినప్పటికీ బాలకృష్ణతో కలిసి నటించడం కాజల్ కు ఇదే తొలిసారి. తాజాగా జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రాయలసీమ షేడ్ తో తెరకెక్కిన గత చిత్రాలకు భిన్నంగా బాలయ్యతో తన సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అనిల్ రావిపూడి హామీ ఇచ్చారు. ఫ్యాక్షనిస్ట్ పాత్రలు చేయడంలో బాలకృష్ణ దిట్ట అని, ఆయన కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే.
షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ సి.ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా తొలి సారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న అనిల్ రావిపూడి ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.