ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతుంది. జగన్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా ఓ సినిమా నిర్మించనున్నారు. దీనిని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు సీక్వెల్ గా తీయబోతున్నారు. ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవే ఈ సినిమాకు కూడా భాధ్యత వహించనున్నారు.
ఇక జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విశాల్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో సినిమాను ప్రారంభించి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందుగానే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలనే అనుకుంటారు కదా. అందుకే ఓ వైపు ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరో వైపు తన ఎదుగుదలలో ఎదురుకున్న కష్టాలను సినిమా ద్వారా ప్రజలకు చూపించనున్నారు. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలను సినిమాలో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి పడ్డ కష్టాలతో పాటు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సినిమాలో వివరించనున్నారట.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం నేపథ్యంలో ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అచ్చం వైఎస్ లాగే కనిపించి సినిమా చూసిన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే విధంగా ఆయన నటన ఉండింది. 2019 ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేశారు.
ఇక యాత్ర సినిమా సీక్వెల్ గా జగన్ బయోపిక్ ను తీసి వచ్చే ఎన్నికల ముందు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘యాత్ర’ సినిమాలో వైఎస్ మరణం వరకు చూపించారు. సీక్వెల్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత జగన్ పార్టీ స్థాపన, ఆయన జైలు జీవితంతో పాటు ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహించిన ఓదార్పు యాత్ర గురించి కూడా చూపిస్తారట. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను కూడా ఈ సినిమాలో పొందుపర్చాలని చూస్తున్నారట.
ఇక జగన్ పాత్రలో ప్రముఖ నటుడు విశాల్ నటించనున్నారు. తెలుగు వారైన విశాల్ తమిళ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బయోపిక్ లో నటించాలని విశాల్ ను సంప్రదించగా ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.
‘యాత్ర’ సినిమాని తీసిన మహి రాఘవనే జగన్ బయోపిక్ ను కూడా తీర్చిదిద్దనున్నారు. అయితే ఇంకా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించే నటుల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.