తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన నటుడు బ్రహ్మాజీ. అయన గురించీ ఆయన నటనా ప్రతిభ గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కేవలం కమెడియన్ గానే కాకుండా సహాయ నటుడుగా, విలన్ పాత్రలు, సెమీ విలన్ పాత్రలు కూడా చేసి ఏ తరహా పాత్రను అయినా అవలీలగా చేస్తారన్న ఇమేజ్ సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా బ్రహ్మాజీ తన వ్యక్తిగత జీవితం గురించి అలాగే తమకు పిల్లలు లేకపోవడానికి గల కారణాలు గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నటుడిగా మారాలన్న నిర్ణయం శంకరాభరణం సినిమా చూసి తీసుకున్నట్లు బ్రహ్మాజీ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా లో పుట్టిన బ్రహ్మాజీ పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగారు. పైగా వాళ్ళ నాన్నగారు ఆ కాలంలో తహసిల్దార్ గా పని చేశారట. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన శంకరాభరణం సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలవడమే కాక తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే క్లాసిక్ సినిమాలకి ఒకటిగా పేరు గాంచింది. ఆ సమయంలో సోమయాజులు గారికి భారీ ఎత్తున సన్మానం కార్యక్రమం నిర్వహించారట.. ఆ సన్మానం చూసి సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ లభిస్తుందా అని భావించి .. ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని బ్రహ్మాజీ నిర్ణయించుకున్నారట.
ఆ క్రమంలో చదువు పూర్తయిన వెంటనే శిక్షణ తీసుకునే సమయంలో కృష్ణవంశీ, రవితేజ ,రాజా రవీంద్ర పలువురితో బ్రహ్మజికి పరిచయాలు కూడా జరిగాయట. ఆ సమయంలో వాళ్లందరూ కూడా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజులు కావడంతో అందరూ కలిసి ప్రయాణం చేశారు. ఇక చాలా సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలలో నటించినా కూడా సంతృప్తి చెందే పాత్రలు దొరకలేదని బ్రహ్మాజీ వెల్లడించారు.
ఇక పిల్లలు లేరు అనే విషయం పై కూడా బ్రహ్మాజీ ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.. ఈ మేరకు బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా బ్రహ్మాజీ చెప్పారు.. ఐతే పెళ్లి చేసుకునే సమయానికే ఆమె మాజీ భర్త నుంచి విడాకులు కూడా తీసుకున్నారట.. చెన్నై లో ఉన్నప్పుడే ఆమెతో తనకు పరిచయం ఏర్పడిందని బ్రహ్మాజీ చెప్పారు. ఒకరినొకరు ఇష్టపడి పెద్దలకు చెప్పి వివాహం చేసుకున్నారట.
ఇక ఆమెను వివాహం చేసుకునే సమయానికే ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. బాబు ఉండగా మళ్లీ మాకు పిల్లల అవసరం లేదు అనిపించిందని.. అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాము అంటూ ఆయన వెల్లడించారు. బ్రహ్మాజీ చెప్పిన ఆ బాబు ఎవరో కాదు.. గత సంవత్సరం పిట్టకథ అనే లవ్లీ ఎంటర్టైనర్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంజయ్. ఆ సినిమాలో బ్రహ్మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు.