రెండు రోజుల క్రితం తెలుగు మీడియాతో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు, సినీ నిర్మాత అర్జున్ సర్జా యువ హీరో విశ్వక్ సేన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ నిర్లక్ష్య వైఖరి మరియు వృత్తిపరమైన ప్రవర్తన లేకపోవటం పట్ల అర్జున్ చాలా కలత చెందినట్లు కనిపించారు.
అర్జున్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, విశ్వక్ సేన్ గత రాత్రి ఒక సినీ కార్యక్రమంలో మాట్లాడుతూ, వెళ్లిపోమాకే నుండి ఓరి దేవుడా వరకు, తాను ఎల్లప్పుడూ యువ దర్శకులతో పని చేసినట్లు.. అలాగే సినిమాకి పని చేసే జట్టుతో కలిసి అందరి సలహాలు సూచనలు తీసుకుని పని చేస్తానని తెలిపారు.
కథలోని మార్పుల విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచనలను తీసుకునేందుకు తాను ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటానని విశ్వక్ చెప్పారు. అలాగే తాను సినిమా నిర్మాణ ప్రక్రియలో పాల్గొంటానని అంగీకరిస్తున్నానని, కానీ ఇతరుల పనుల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోనని చెప్పారు. అంతే కాదు, కొన్ని విషయాల పై చర్చించేందుకు షూట్‌ని ఒకరోజు వాయిదా వేయాలని అర్జున్ ను కోరినట్లు తెలిపారు.
అలాగే అర్జున్‌ని చిన్నప్పటి నుంచి ఒక ఆదర్శంగా చూసాను కాబట్టే ఈ సినిమా చేయడానికి అంగీకరించానని.. అయితే అర్జున్ తాను అడిగిన మార్పులను స్వీకరించెందుకు సిద్ధంగా లేడని తనకు అర్థమైందని విశ్వక్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఫలితం పై అనుమానం రావటంతో సినిమా నుండి తప్పుకున్నట్లు విశ్వక్ చెప్పారు.
తాను వృత్తి పరంగా నడుచుకోలేదు అని అర్జున్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా.. విశ్వక్ సేన్ తను చాలా నిబద్ధత మరియు వృత్తిపరమైన నటుడినని చెప్పారు. ఒక లైట్ బాయ్ తన పై అభ్యంతరం చెప్పినా పరిశ్రమకు దూరం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విశ్వక్ సేన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ, అర్జున్ మరియు చిత్ర బృందం ను తాను అవమానించినట్లు భావిస్తే వారికి క్షమాపణలు కోరారు.
ఇలా అర్జున్ – విశ్వక్ సేన్ కలయికలో రావాల్సిన సినిమా ఈ నటుడు మరియు దర్శకుడి మధ్య ఉన్న సృజనాత్మక విభేదాల కారణంగా రద్దు చేయబడింది. ఇప్పుడు నటుడు అర్జున్ హీరో పాత్రకి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి హీరో శర్వానంద్ సరైన ఎంపిక అని అర్జున్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరియు శర్వా ఈ చిత్రానికి హీరోగా చేస్తే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నారట.
అయితే అర్జున్ ఇంకా శర్వానంద్‌కి స్క్రిప్ట్ చెప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే శర్వానంద్‌ని కలిసే ఆలోచనలో అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారైనా ఎలాంటి విభేదాలు లేకుండా అర్జున్ తలపెట్టిన ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.