గతంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. ముందుగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలను రీ రిలీజ్ అవగా.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా జల్సా, తమ్ముడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఘరానా మొగుడు, ఇటీవల నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాను రిలీజ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్.. కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
అయితే ఆది సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ప్రవేశించి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించగా అలీ, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక జూనియర్ ఎన్టీఆర్ కి సూపర్ స్టార్డం తెచ్చి పెట్టింది.
అయితే ఆది సినిమా రీ రిలీజ్ ను భారీ స్థాయిలో జరిపించడం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక అగ్ని పరీక్ష వంటిదేనని అనిపిస్తుంది. అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ మరియు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఇటీవలే వచ్చిన విభేదాలే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు పై ఆయన ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం పస లేదని భావించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయనని వేరు చేసినట్టుగా వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి నేపథ్యంలో ఆది సినిమా రీ రిలీజ్ చేస్తే టీడీపీ వర్గాలు, బాలకృష్ణ అభిమానులు ఇదివరకటిలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడడానికి థియేటర్లకు వస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరి ఇలాంటి అనుమానాలు పటా పంచలు చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలసికట్టుగా నిలిచి తమ బలాన్ని చూపించే స్థాయిలో ఆది సినిమా రీ రిలీజ్ తో రికార్డులు బద్దలు కొట్టాలి. అప్పుడే ఎన్టీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేసిన వారిని తిప్పికొట్టినట్లు ఉంటుంది.