తెలుగు సినీ పరిశ్రమకు మరియు సినీ జర్నలిస్టులకు మధ్య సంబంధాలు కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో సినీ పాత్రికేయులను ఎంతో గౌరవిస్తారు. అయితే కొందరు జర్నలిస్టులు మాత్రం అర్థంపర్థం లేని ప్రశ్నలు వేస్తూ మొత్తం మీడియాను కించపరుస్తున్నారు.
గత కొన్ని నెలలుగా సినీ కార్యక్రమాలు మరియు ప్రెస్ ఇంటర్వ్యూలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా 3 – 4 మంది జర్నలిస్టులు నిరంతరం ఒకే రకమైన అసంబద్ధమైన మరియు అర్థంలేని ప్రశ్నలను అడుగుతున్నారు. ఇవి ఆ ప్రశ్నలను ఎదుర్కుంటున్న వారిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచుతున్నాయి. ఈ పాత్రికేయులు ప్రధానంగా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలను తమ సిల్లీ ప్రశ్నలతో టార్గెట్ చేస్తున్నారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా విరూపాక్ష రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఓ విలేకరి సాయిధరమ్ తేజ్ ను సినిమాలో ఓవర్ రొమాంటిక్/సెక్సువల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా.. అందుకే సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందా అని అడిగారు.
ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ నిజానికి కాస్త నిర్ఘాంతపోయినా చాలా సరదాగా సమాధానమిచ్చారు. ఈ సినిమాలో అలాంటి రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవని, అయితే ఇందులో హారర్ ఎలిమెంట్స్, ప్రేక్షకులను ఉత్తేజపరిచే సన్నివేశాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కాగా జర్నలిస్ట్ అడిగిన సిల్లీ ప్రశ్న పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాస్త బుద్ధి ఉండాలని హితవు పలికారు.
ఇటీవలే అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా మీడియా ఇంటరాక్షన్ లో కూడా కొందరు పాత్రికేయులు తెలివితక్కువ ప్రశ్నలు అడిగారు. అలాగే డిజే టిల్లు సినిమా సమయంలోనూ ఇంకా గతానికి వెళితే రాజమౌళి యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ టీంకు కూడా జర్నలిస్టుల నుంచి కొన్ని వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ పాత్రికేయులు తెలిసో తెలియకో తమ ప్రవర్తనతో మొత్తం మీడియాను కించపరుస్తున్నారు.