తెలుగు సినిమా పరిశ్రమలో విజయాల శాతం ఎక్కువగా ఉన్న అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆయన నిర్మాతగా ఉన్నారంటే హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా కథలో, సినిమాలో ఖచ్చితంగా నాణ్యత ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకులలో నాటుకు పోయింది అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎప్పటికపుడు ప్రేక్షకుల అభిరుచులకు, అనుగుణంగా సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా.. అక్కినేని నాగ చైతన్య హీరోగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ” థాంక్యూ” చిత్ర ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఆయన ప్రెస్ తో కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా ఆయన మారిన ప్రేక్షకుల అభిరుచులతో పాటు తన హిందీ సినిమా ప్రయాణం గురించి కూడా చర్చించారు.
అంతటి అనుభవం, మార్కెట్ పై మంచి పట్టు ఉన్నా కూడా దిల్ రాజు బాలీవుడ్ లో మాత్రం చేదు అనుభవాలు ఎదురుకున్నారు. తెలుగులో హిట్ సినిమాలు గా నిలిచిన జెర్సీ మరియు హిట్ చిత్రాలను దిల్ రాజు హిందీలో తెరకెక్కించారు. జెర్సీ చిత్రానికి హీరో షాహిద్ కపూర్ కాగా, హిట్ హిందీ వెర్షన్ లో రాజ్ కుమార్ రావు హీరోగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు ఆయనకు నష్టాలను మిగిల్చాయట.
కబీర్ సింగ్ (తెలుగు అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్) తరువాత షాహిద్ కపూర్ తో జెర్సీ సినిమా తీయడం లాభసాటి బేరంగా అనుకున్నామని, ఆ చిత్రానికి 30 కోట్ల వరకూ లాభాలు వస్తాయని భావిస్తే, కోవిడ్ – 19 ప్రభావం వల్ల ఆ సినిమా చాలా ఆలస్యంగా విడుదల అయిందని, రిలీజ్ టైం కి బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తరహా సినిమాలు చూడటం మానేశారని చెప్పిన దిల్ రాజు.. జెర్సీ వల్ల లాభాలు మాట అటుంచి 4-5 కోట్ల దాకా నష్టాలు మిగిలాయని తెలిపారు.
ఇక హిందీలో ఆయన తీసిన రెండో సినిమా హిట్ గురించి చెబుతూ.. సాధారణంగా రాజ్‌కుమార్ రావు సినిమాలకు బాక్సాపీస్ వద్ద తొలి వీకెండ్‌లో దాదాపు 15 కోట్ల వరకూ కలెక్షన్లు వస్తాయని, కానీ ప్రస్తుతం ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు రావడం అలవాటు పడని పక్షంలో 6 కోట్లు మాత్రమే వచ్చాయని, టాక్ బాగుంది కాబట్టి కలెక్షన్లు తరువాత పుంజుకుంటాయి అని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరి ఆయన నమ్మకం అవుతుంది లేదో చూద్దాం.