బాహుబలి-1 ని హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ అప్పటి నుండి దక్షిణ సినిమా వైపు దృష్టి సారించారు. చాలా వేదికల్లో , ఇంటర్వ్యూ లలో దక్షిణ సినిమా గురించి మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు.
ఒకప్పుడు మన సినిమాలో హిందీ సినిమాలకి ఇరు భాషల మార్కెట్ కి చాలా తేడా ఉండేది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ పరిస్థితిలోమార్పు వచ్చింది. బాహుబలి లాంటి సినిమాల వల్ల కావచ్చు, ఓటిటి మరియు పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం వల్ల కావచ్చు. అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు వీక్షించగలుగుతున్నారు. సరైన విధంగా సినిమా ప్రమోట్ చేసి రిలీజ్ చేసుకోగలిగితే హిందీ ప్రేక్షకులు మన సినిమాలను చూడటానికి ధియేటర్ లకు వస్తారు అని బాహుబలి సీరీస్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు రుజువు చేశాయి. మొన్న విడుదలైన మేజర్ చిత్రం కూడా హిందీలో 15 కోట్ల గ్రాస్ వరకూ వసూలు చేసింది.
ఈ విషయం మీదే మాట్లాడుతూ కరణ్ జోహార్ ఇలా అన్నాడు. “సౌత్ మూవీ మేకర్స్ కి వాళ్ళ మీద వాళ్ళు చేసే సినిమాల మీద గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా పూర్తి విశ్వాసంతో చేస్తారు. మా దగ్గర (బాలీవుడ్)లేనిది అదే. ఒకటి రెండు బయోపిక్ లు హిట్ అవగానే అందరం బయోపిక్ లు తీయడానికి బయలుదేరుతాం. అలాగే ఈ మధ్య కొత్తగా సౌత్ సినిమాలకు దగ్గరగా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. మా బలాల గురించి బలహీనతల గురించి సరిగ్గా విశ్లేషణ చేసుకోకుండా అన్ని చోట్లా మేమే ఉండాలి అని చూస్తుంటాం”అని ఆయన అభిప్రాయపడ్డారు.కరణ్ జోహార్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదు. అయితే ఇది కేవలం ప్రశంసగా తీసుకుంటే మంచిది. అలా కాకుండా మనం ఏ సినిమా తీస్తే అది జనం చూస్తారు అని అతి నమ్మకంతో ఉంటే మొదటికే మోసం వస్తుంది.