తమిళంలో గత ఏడాది అద్భుత విజయం సాధించిన సినిమా “మానాడు”. దర్శకుడు వెంకట్ ప్రభు – హీరో శింబులకు చాలా కాలం తరువాత మంచి హిట్ సినిమాగా నిలిచిందీ చిత్రం. థియేటర్లలోనే కాదు ఓటీటీలో విడుదలైన తరువాత కూడా “మానాడు” చక్కని స్పందనను రాబట్టుకుంది. ఇదిలా ఉండగా ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులు నిర్మాత సురేష్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మహరాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లతో పాటు చివరికి నాగ చైతన్య హీరోగా నటిస్తున్న విషయం దాదాపు ఖరారు చేసేసారు.
అయితే.. తాజాగా ‘మానాడు’ రీమేక్ లో కాకుండా దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగ చైతన్య ఒక స్ట్రెయిట్ తమిళ/తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో మానాడు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తున్నారు? అసలు ఆ సినిమా రీమేక్ ఉంటుందా లేక అటకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్న దశలో ఎట్టకేలకు ఈ విషయం పై ఒక స్పష్టత వచ్చింది.
ఆ హీరో మరెవరో కాదు రానా దగ్గుబాటి నే..ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ రీమేక్ వెర్షన్ లో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సబ్జెక్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది.
ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రానా, తదుపరి బాబాయి వెంకటేశ్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ లోనూ రానా కనిపించబోతున్నారు అని సమాచారం. ఈ యువ హీరో చేయబోయే తదుపరి చిత్రాలు చక్కని విజయాలు సాధించి ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.