యువ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో యమా జోరుగా సాగుతుంది. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే సినిమాని దాదాపు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యే రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇక ఈ సినిమా పూర్తి అవకముందే మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ తో వచ్చారు కిరణ్. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ గతంలో ఓ సినిమాకు కిరణ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించనున్నారు. మురళి కిషోర్ అబ్బురి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. పూజా కార్యక్రమాలు ఏనాడో పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి బుధవారం సాయంత్రం 5 గంటలకు అప్‌డేట్ ఇస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అన్నట్టుగానే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ (Glimpse) విడుదల చేశారు.
హీరో కిరణ్ అబ్బవరం కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ విడుదల చేసిన ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. “ఏడు వింతల గురించి మాకు తెలియదు కానీ..మా జీవితాలు ఏడు కొండల చుట్టూ తిరుగుతాయి” అంటూ హీరో కిరణ్ చెప్పే డైలాగ్ కు తోడు వినసొంపుగా ఉన్న నేపథ్యగానం చాలా బాగుంది. అలాగే హీరో పేరు విష్ణు అని చెప్పకనే చెప్పారు. మరి తన పని తాను చూసుకునే విష్ణు ఆయుధం ఎందుకు పట్టాల్సి వచ్చింది? తనకు తానే కొత్తగా అనిపించేలా అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.