సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రంగులు.. హంగులు ఉంటాయో వారి వ్యక్తిగత జీవితంలో బయటకి కనిపించని కొన్ని చేదు సంఘటనలు, అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే వారు వృత్తి పరంగా స్టార్స్ అయినప్పటికీ వాళ్ళు కూడా సాధారణ మనుషులే కదా. వాళ్ళకి కూడా సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. అందులో హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవడం అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం కూడా మాములు విషయంలా అయిపోయింది.
తాజాగా బెస్ట్ కపుల్ అనబడే విధంగా నడుచుకున్న నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ కూడా చేరారు. ఇక ఈ లిస్ట్ లో మరో జంట చేరింది. అయితే వారు హీరో హీరోయిన్లు కారు. ఆ జంట దర్శకుడు శ్రీను వైట్ల – రూపా వైట్ల.
ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల నుంచి విడాకులు కావాలని ఆయన భార్య రూపా వైట్ల కోర్టును ఆశ్రయించారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె నాంపల్లి కోర్టులో ఈ మేరకు డైవర్స్ కు ఫైల్ చేసారని చెప్పుకుంటున్నారు. అది మాత్రమే కాదని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దంపతులు విడిగా ఉంటున్నారని చెప్తున్నారు. అభిప్రాయ భేధాలు విపరీతంగా పెరిగి పోవటమే విడాకులుకు కారణంగా వినపడుతోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే ఇరు పక్షాలలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. శ్రీనువైట్ల ప్రస్తుతం పూర్వ తన వైభవాన్ని అందుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లతో ఒక దశలో తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుల జాబితాలో ఉండేవారు. అయితే ఆ తరువాత వరుస పరాజయాల వల్ల వెనక్కి తగ్గిపోయారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తీసిన ‘మిస్టర్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవగా.. రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ఢీ అండ్ ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. వారి కాంబినేషన్లో వచ్చిన ఢీ సీక్వెల్ గా ఆ సినిమా ఉంటుందనే మాట వినిపించినా తరువాత అదేమీ లేదని కేవలం టైటిల్ అలా ఉంది తప్ప పార్ట్ 2 కాదని మంచు విష్ణు తెలిపారు.