“విక్రమ్” తరువాత అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులలో లోకేష్ కనగరాజ్ టాక్ ఆఫ్ ది టౌన్ లా మారాడు. స్టైలిష్ యాక్షన్ జానర్ లో తనకంటూ ఒక ముద్ర వేశాడు లోకేష్.
ఇక “విక్రమ్” సినిమాలో “ఖైది” తాలూకు లింక్ ను జోడించి అందరిని మరింత ఆశ్చర్యపరిచాడు అనే చెప్పాలి. ఢిల్లీ, విక్రమ్ ల పాత్రలను ఎలా ఒక దగ్గరకి చేరుస్తాడు అనే అంశంతో పాటు వాళ్ళకి ఎదురుగా విలన్ పాత్రగా రోలెక్స్ ను ఎలా చూపిస్తాడు అన్న ఆలోచనకే ప్రేక్షకులు తెగ ఎక్సయిట్ అవుతున్నారు.
కాగా లోకేష్ ఇదివరకే తాను ఒక సినిమాటిక్ యూనివర్స్ ను రూపొందిస్తానని చెప్పడం జరిగింది. అన్ని పాత్రలు, వివిధ రకాల నేపధ్యాలను అనుసంధానం చేయడం కత్తి మీద సామే అయినప్పటికీ, అతని సమర్థత పై ఎవ్వరికీ అనుమానాలు లేవనే చెప్పాలి.
ఇన్ని ఆసక్తికర విషయాలకి మరో కొత్త వార్త ఇప్పుడు వినబడుతుంది. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లోకేష్ కనగరాజ్ కలయికలో ఒక చిత్రం రాబోతుంది అని.ముందుగానే చెప్పుకున్నట్టు “విక్రమ్” తరువాత లోకేష్ మీద అందరికీ నమ్మకం వచ్చింది. అతనితో కలిసి పని చేయడానికి యే హీరో అయినా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు.
అలాగే రామ్ చరణ్ కూడా లోకేష్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. “విక్రమ్” తరువాత లోకేష్ తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేయవలసి ఉంది. ఆ చిత్రం పూర్తి అయ్యాక రామ్ చరణ్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అయితే రామ్ చరణ్ పాత్ర లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం అవుతుందా లేక లోకేష్ తనతో వేరే ఏదైనా సినిమా తీస్తాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.