లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో సూపర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు తమదైన శైలిలో పోషించి ప్రేక్షకులని అలరించారు. ఇక సినిమా చివర్లో తళుక్కున మెరిసిన తమిళ స్టార్ హీరో సూర్య పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇలాంటి భారీ విజయం తరువాత కమల్ ఏం సినిమా చేస్తారా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పా రంజిత్, మహేష్ నారాయణన్ వంటి యువ దర్శకులతో సినిమాలు లైన్ లో పెట్టిన కమల్.. అంతకంటే ముందు ఇదివరకే మొదలు పెట్టి అనుకోని పరిస్థితుల్లో షూటింగ్ నిలిపి వేసిన భారతీయుడు 2 (Indian 2) సినిమాను తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది.
1996లో సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన “భారతీయుడు” సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి సీక్వెల్ ను 2017లో ప్రకటించి, షూటింగ్ ను 2019 లో ప్రారంభించారు. అయితే షూటింగ్ కొన్ని రోజులు సాగిన తరువాత సెట్ లో అనుకోని విధంగా అగ్ని ప్రమాదం జరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం విక్రమ్ సినిమాతో మంచి ఊపు మీదున్న కమల్ హాసన్, ఈ సమయంలో భారతీయుడు 2 సినిమాని తిరిగి సెట్స్ మీదకు తీసుకు వస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారట. అందుకే దర్శకుడు శంకర్ తో ఈ మేరకు చర్చలు జరిపారని తెలుస్తోంది. నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ కూడా ఇప్పుడు కమల్ హాసన్ ఉన్న ఫామ్ కి డబ్బులు ఖర్చు పెడితే లాభసాటి వ్యాపారం జరిగే వీలుందనే అలోచనలో ఉన్నారట. ఈ మేరకు వచ్చే ఏడాది ఆరంభంలో భారతీయుడు సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.