యూట్యూబ్ నుండి వెండి తెర స్థాయికి ఎదిగిన నటుడు సుహాస్. హీరో స్నేహితుడిగా కొన్ని, అలాగే కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసి మెప్పించారు. ముఖ్యంగా మజిలీ చిత్రంలో సహయక పాత్రలో సుహస్ నటనకు చక్కని ప్రశంసలు దక్కాయి. అలాగే “ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రంలోనూ సుహాస్ ఆకట్టుకున్నారు.
ఆ పైన ఓటీటీలో విడుదలైన “కలర్ ఫోటో”తో హీరోగా మారారు. ఆ సినిమా కరోనా కారణంగా థియేటర్లకు బదులు ఓటీటీ లో విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాలో హీరోయిన్ చాందినీ చౌదరి ప్రేక్షకులకి కాస్త పరిచయం. ఆమె తప్ప సుహస్, దర్శకుడు యూట్యూబ్ నుంచి వచ్చిన వారే. ఆ సినిమాకు సంపూర్ణేష్ బాబు ను హీరోగా పరిచయం చేస్తూ “హృదయ కాలేయం” అనే సినిమాతో అందరి చూపును తమ వైపుకు తిప్పుకున్న సాయి రాజేష్ కథ అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు.
ఇక ఆ తరువాత మరోసారి ఓటీటీ లోనే విడుదలైన “ఫ్యామిలీ డ్రామా” లో సైకో కిల్లర్ పాత్రలో నటించి ఔరా అనిపించారు. ఇలా చిన్న కెరీర్ లోనే విలక్షణ నటుడిగా ఎదిగిన సుహస్ .. ఇప్పుడు రైటర్ పద్మ భూషణ్‌తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు.
లహరి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక పాటను ఇటీవలే విడుదల చేసారు. ‘కన్నుల్లో నీ రూపమే’ అంటూ సాగే ఈ పాటకు శేఖర్ చంద్ర స్వరకల్పన చేసారు.
సున్నితమైన ఈ మెలోడీ గీతాన్ని భాస్కర భట్ల రాయగా, ధనుంజయ్ పాడారు. సుహాస్ కు జంటగా టీనా శిల్పరాజ్ నటిస్తున్నారు. అలాగే రోహిణి, ఆశిష్ విద్యార్థి వంటి సీనియర్ నటులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.