ప్రకాష్ రాజ్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో ఆయన చేసినన్ని వైవిధ్యమైన, విలక్షణ పాత్రలు అన్నీ ఇన్ని కావు. ఆయన నటించిన ప్రతి భాషలోనూ అక్కడి ప్రేక్షకులను తనదైన నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్. వివిధ భాషల్లో నటిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్ కి ఆయా భాషలపై మంచి పట్టు కూడా ఉంది. పలు భాషల్లోని సాహిత్యాన్ని ఆయన ఎక్కువగా చదువుతూ ఉంటారు కాబట్టి ఆ సాహిత్యం యొక్క ప్రభావం ఆయనపై కనిపిస్తూ ఉంటుంది.
అందువల్లనే సామాజిక అంశాలపై, సమస్యలపై వెంటనే ఆయన స్పందిస్తూ ఉంటారు. అలాగే నటనతో పాటు ఆయన కొన్ని చిత్రాలను స్వయంగా తానే దర్శకత్వం వహించి నిర్మించారు కూడా. అందులో కొన్ని ఇతర భాషల చిత్రాలకు రీమేక్ లు కాగా, ధోనీ వంటి స్ట్రెయిట్ సినిమా కూడా తీశారు. అయితే అవేవీ బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపకపోగా.. కంటెంట్ పరంగా కూడా అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి.
ఆ సినిమాల వల్ల దర్శకుడిగా.. నిర్మాతగా ప్రకాష్ రాజ్ కు పెద్దగా పేరు రాకపోయినా.. ఆయన అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే.. ఆయన తన అభిరుచిని ప్రదర్శించడానికి, కోన్ని కథల పై ఉన్న ఇష్టంతో తెరకెక్కించానని ప్రకాష్ రాజ్ చెబుతూ ఉంటారు.
నటుడిగా బిజీగా ఉండే ఆయన ఏమాత్రం సమయం దొరికినా దర్శకుడిగా మారుతూ ఉంటారు. అలా ఇప్పుడు ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఈ మేరకు ప్రకాష్ రాజ్ ఇప్పుడు సామాజిక మరియు రాజకీయ అంశాలతో ఒక సినిమాను రూపొందించనున్నారు. ‘మనలో ఒకడు’ అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతుందని ప్రకాష్ రాజ్ చెప్పారు. మరి ఈసారైనా ఆయన ప్రయత్నంలో విజయం సాధిస్తారో లేదో చూడాలి.