తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు అడవి శేష్. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చక్కగా నిరూపించుకున్నారు. ఆయన ఒక సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో తప్పకుండా ఆ చిత్రం పై మంచి ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ విధంగా మొదటి సినిమా నుండి మొన్నటి మేజర్ వరకు నటుడిగా విభిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు అడవి శేష్.
ప్రస్తుతం శేష్ హిట్ 2 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు అడివి శేష్ మరో సీక్వెల్ లో నటిస్తున్నారు. ఆ సినిమానే గూడచారి 2 కాగా ఈ సినిమా గురించి ఇటీవల మీడియాతో మాట్లాడిన శేష్, నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారని, ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం తన మనసులో ఉన్న ఒక లైన్ ని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు శేష్ తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న గూఢచారి-2 సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.
తప్పకుండా గూఢచారి 2 అందరి అంచనాలను అందుకునే విధంగా తెరకెక్కించేలా తాను, తన టీమ్ కష్టపడుతోందని చెప్పారు శేష్. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా 2018లో ప్రేక్షకుల ముందు వచ్చి అటు విమర్శకుల ప్రశంసలని ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను సాధించి విజయం సాధించింది. ఇందులో రా ఏజెంట్ గోపి పాత్రలో కనిపించారు అడివి శేష్.
మరి త్వరలో తెరకెక్కనున్న గూఢచారి 2 పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అడవి శేష్ అండ్ టీమ్ అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.