2022లో బాలీవుడ్ చాలా దిగువ స్థాయిలో ఉంది. భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జియో మొదలైన కొన్ని సినిమాలు మంచి వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని ప్రదర్శన కనబరిచినప్పటికీ, లాల్ సింగ్ చద్దా, సామ్రాట్ పృథ్వీరాజ్, ఎటాక్, రక్షా బంధన్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి బాలీవుడ్ స్టార్స్ అందరూ అనూహ్యంగా భారీ పరాజయాలను ఎదుర్కొన్నారు.
కాగా ఈతరం స్టార్ హీరో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మాత్రం భారీ హైప్ తో వచ్చి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సంపాదించిన సినిమాగా నిలిచింది. అయితే సినిమా కంటెంట్ విషయంలో కాస్త నిరాశ పరచడంతో విడుదలకు ముందు ఊహించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవలేదు కానీ డీసెంట్ హిట్ అనిపించుకుంది.
అయితే బాలీవుడ్ ఇలా దీన స్థితిలో ఉండటానికి ఒక రకంగా పెరిగిన టిక్కెట్టు ధర కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు కలిసి ఒక సినిమా చూడాలి అనుకుంటే టికెట్ల ధర, తినుబండారాల ధరను కలుపుకుని ఎంత లేదన్నా 3000 పైనే ఖర్చు అవుతుంది. ఇది కూడా కాస్త చూచాయగా ఖర్చు పెడితేనే, ఖర్చు పట్టించుకోకుండా ఉంటే 5000 కూడా దాటచ్చు.
అందుకే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన రాబోయే `దృశ్యం 2` సినిమాకి PVR చైన్ ఆఫ్ సినిమాస్ తో భాగస్వామ్యమై టిక్కెట్ ధరలపై ఆసక్తికరమైన ఆఫర్ ను ప్రకటించారు. ఈ ఆఫర్ ద్వారా ప్రేక్షకులు తమ టిక్కెట్లను PVR యాప్ లో కేవలం 50 రూపాయలకే బ్లాక్ చేసుకోవచ్చు. సినిమా మొదటి రోజు షోలపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల తమ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని, దృశ్యం 2 చిత్ర బృందం భావిస్తున్నారు.
దృశ్యం 2 చిత్రం మోహన్‌లాల్ 2021లో అదే టైటిల్ తో వచ్చిన బ్లాక్‌బస్టర్‌కి రీమేక్. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు ఇప్పటికే తెలుగు-మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో పార్ట్ 1 కూడా మంచి విజయాన్ని సాధించింది.
అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్- టబు- శ్రియా శరణ్- అక్షయ్ ఖన్నా- ఇషితా దత్తా- మృణాల్ జాదవ్- రజత్ కపూర్ నటించారు.