యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సీరీస్ తో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రభాస్ వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలు పెట్టారు.బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా.. హిందీ వెర్షన్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అనే సినిమాను చేశారు. ఈ సినిమా ఈ మార్చిలో విడుదలై పరాజయం పాలయింది.
ఇక అది అలా ఉంటే వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న ప్రభాస్.. మధ్యలో కాస్త రిలీఫ్ కోసం ఒక సాధారణ తెలుగు సినిమా చేయాలనే ఆలోచన చేశారు.
అందుకే కామెడీ సినిమాలు తెరకెక్కించడంలో తనదైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు మారుతితో ఒక హారర్ కామెడీ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాల మధ్య మారుతితో సినిమా చేయడం అంత మంచిది కాదన్న వాదన ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, మరియు ఆయన అభిమానుల నుంచి వినిపించింది.
తాజాగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గోపిచంద్ హీరోగా నటించిన “పక్కా కమర్షియల్” అట్టర్ ప్లాప్ అవడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరింది.ఇలాంటి పరిస్తితిలో మారుతితో సినిమా చేస్తే అది ఖచ్చితంగా చేదు అనుభవాన్నే మిగులుస్తుంది అని ప్రబాస్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి అని సమాచారం. వారి వాదనలోనూ నిజం లేకపోలేదు.
ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ – మారుతి సినిమా ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మారుతితో సినిమాకు సమయం కేటాయించే అవకాశం చాలా తక్కువని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ వార్తలు నిజం అవుతాయా లేక మారుతి ప్రభాస్ తో సినిమా తీస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇరు పక్షాలలో ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేస్తే గానీ తెలియదు.