ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే తన సినీ కెరీర్‌లో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో తిరిగి సినిమాలోకి వచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. తాను కమిటైన అన్ని సినిమాల షూటింగ్ లను త్వరగా పూర్తి చేస్తున్నారు.
కాగా గత కొన్ని రోజులుగా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆయన వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల షెడ్యూల్స్ కోసం ఇచ్చిన డేట్స్ అన్నీ తారుమారు అయ్యాయనే వార్తలు తెగ జోరుగా ప్రచారం అయ్యాయి.
ఆ కారణంగానే ఆయన.. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇబ్బందులలో పడినట్టు తెలుస్తోంది.పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ సినిమా క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండా అలాగే పనులన్నీ ఆగిపోవడంతో ఈ పుకార్లన్నీ నిజమే అని పవర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ పవన్ కళ్యాణ్ ను కలిశారట.ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుందని, ఇలాంటి పక్కా మాస్ ఎంటర్టైనర్ చేసి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులను కూడా రంజింపజేసి ఆ పై రాజకీయాలకు వెళ్లవచ్చని పవన్ తో హరీష్ అండ్ టీమ్ చెప్పినట్టు తెలుస్తుంది. రాజకీయాలలోకి శాశ్వతంగా వెళ్ళే ముందు ఇలాంటి సినిమా మంచి వీడ్కోలుగా ఉంటుంది అని దర్శకుడు హరీష్ శంకర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ టీమ్ పవన్ ను శతవిధాలా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అయితే వారి ప్రయత్నాలు ఫలించి పవన్ సినిమాకి ఓకే చెప్పారా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయన ఈ సినిమా చేస్తేనే బాగుంటుందని అనుకుంటూ సినిమా సెట్స్ మీదకు వెళితే బాగుండు అని ఆశిస్తున్నారు.