జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్.. గత కొన్ని రోజులుగా ప్రజా సమస్యల పై దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్రతో పాటు జనవాణి టూర్ గా కూడా ఆ యాత్రకు నామకరణం చేయడం జరిగింది. ఐదు విడతలుగా జనవాణి టూర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇందులో మూడు విడతల టూర్ వరకూ పూర్తయింది. కాగా వచ్చే వారం జరగాల్సిన నాలుగో విడత టూర్ వాయిదా పడింది.
తాజాగా గోదావరి జిల్లాల్లో వరద బాధితుల్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న వాతావరణ పరిస్ధితులతో పవన్ కు విషజ్వరం సోకింది. పవన్ తో పాటు ఆయన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు,నేతలకు కూడా విష జ్వరాలు సోకాయి అని తెలుస్తుంది. దీంతో తదుపరి జనవాణి కార్యక్రమంపై సందిగ్ఘత నెలకొంది.
ఇదిలా ఉండగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ఒక వారం రోజుల పాటు వాయిదా పడిందని పార్టీ తరఫున జనసెన పార్టీలో ముఖ్య సభ్యుడైన నాదెండ్ల మనోహర్.. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం వైరల్ ఫీవర్ సోకిందని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షులతో పాటు మరి కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు.
ఈ తాజా పరిణామాల వల్ల ఈ నెల 24 న జరగాల్సిన జనవాణి ఒక వారం రోజులు అంటేఈ నెల 31వ తేదీన జరుగుతుందని అన్నారు. అయితే ఆ సమావేశం జరిగే స్థలం మరియు వేదిక వివరాలను త్వరలోనే తెలియచేస్తామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ, భీమవరంలో మూడు విడతల జనవాణి కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఆ పైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో మిగిలిన రెండు కార్యక్రమాలు జరుగుతాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.