నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆ టాగ్ కు తగ్గట్లే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే, ఆమెకు అన్ని భాషల పరిశ్రమల నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం..కోలీవుడ్ నుంచి ఆమెకు పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చిందట.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా, రజనీకాంత్ తో ‘కాలా’, ‘కబాలి’ సినిమాలు తీసిన పా.రంజిత్ కాంబినేషన్లో ఇటీవలే ఒక చిత్రం ఖరారయింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పైగా ఇది విక్రమ్ కు కెరీర్ లో అరవై ఒకటో చిత్రం (61st movie) కావడం విశేషం. ఆయనకు జోడీగా రష్మికను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. త్వరలో ఆమెను కలిసి కథ చెప్పనున్నారు అని సమాచారం. ఇక ఈ చిత్రానికి రష్మిక ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాను 1800 కాలం నాటి నేపధ్యంలో, త్రీడీ (3D) టెక్నాలజీతో తీయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అందుకే, అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న రష్మికను కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా, వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ సినిమా ‘వారసుడు’లో రష్మిక నటిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప 2’ లో పాల్గొనాలి. ఇక దుల్కర్ సల్మాన్ – మృణాల్ టాకుర్ జంటగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘సీతా రామం’ లోనూ రష్మిక నటిస్తున్నారు. ఆ చిత్రం ఆగస్ట్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా హిందీలో రెండు సినిమాలు, తెలుగులో మరో సినిమా ఉంది. ఇక విక్రమ్ – పా రంజిత్ సినిమా కూడా ఒప్పుకుంటే మరో ఆసక్తికరమైన సినిమా ఆమె ఖాతాలో చేరినట్లే.