ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల బిజినెస్ అద్భుతంగా ఎదుగుతుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ సంస్థల హవా పెరగడం, డిజిటల్ వినోదానికి ప్రేక్షకులు బాగా అలవాటు పడటంతో ఈ రంగంలో భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. ముందు ముందు ఈ పద్ధతి మరింత కొనసాగుతుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈతరం దర్శకులు కూడా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిచండానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఎందుకంటే వెబ్ సీరీస్ లకు నిడివి పరంగా పరిమితులు ఉండవు.అలాగే ఫార్ములాలు లోబడి తీయాల్సిన అవసరం కూడా ఉండదు. తాము అనుకున్నది అనుకున్నట్టుగా ఎన్ని భాగాల్లో అయినా చెప్పే అవకాశం ఉండడం, అలాగే తమ ప్రతిభ ఎక్కువ మందికి చేరువ అయ్యే మార్గం ఉండడంతో అగ్ర దర్శకులు కూడా వెబ్ సిరీస్‌ల నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించగా, కొందరు నిర్మాతలుగా, కథకులుగా వ్యవహరించారు.
ఇప్పుడీ జాబితాలోకి అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తో రాజమౌళి కలిసి పని చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. లోగడ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ప్రారంభమైన కొన్ని రోజులకే ఆ ప్రయత్నం ఆపేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఆశించిన స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ జరగని కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఆ సిరీస్‌ను పక్కన పెట్టేసినట్లు తెలిసింది.
ఇప్పుడు ఏకంగా రాజమౌళితోనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించే ఈ వెబ్ సిరీస్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇటు రాజమౌళి కానీ, అటు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒకవేళ అరుదైన ఈ కలయిక నిజం అయితే మాత్రం ఓటీటీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగడం ఖాయం.