కరోనా తరువాత తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటూ వస్తుంది. ఒక వైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. మరో వైపు సినిమాల నిర్మాణం నెలల తరబడి వాయిదా పడటం వంటి కారణాలతో నిర్మాతలకు పలు రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ ఏడాది వేసవిలో ఆర్ ఆర్ ఆర్ , కేజీఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు సర్కారు వారి పాట వంటి అగ్ర హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేసి కాస్త ఊపిరి పోయడంతో మెల్లగా ఒక క్రమంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
ఆ రకంగా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టించాయి. ఆ తరువాత అగ్ర హీరోలు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు తీయాలనే ఆలోచనతో ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా పెరగడం మొదలు పెట్టింది.
దీనికి తోడు ఇదివరకే చెప్పుకున్నట్లు ప్రేక్షకులు టాక్ చాలా బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు.ఇందుకు పెరిగిన టికెట్ ధరలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాటి ప్రభావం వల్ల సినిమాలు కేవలం తొలి మూడు రోజులు మాత్రమే సరైన విధంగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఆ తరువాత ఎంతో హైప్ ఉన్న సినిమాలు తప్ప మిగతా రోజులలో కలెక్షన్లు రావడం లేదు.
ఇక పెరిగిన నిర్మాణ వ్యయం, ఆర్టిస్ట్ ల రికార్డు స్థాయి రెమ్యూనరేషన్లు మరియు టెక్నీషియన్ల పారితోషికాలు, ఓటీటీ ప్రభావం, వీపీఫ్ ఛార్జీలు వంటి అనేక సమస్యలు నిర్మాతలను చుట్టు ముట్టాయి.
దీనిపై నిర్మాతలంతా ప్రత్యేకంగా ఓ భేటీని ఏర్పాటు చేసుకుని కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచనలో వున్నారట.ఈ మేరకు జూలై 21న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించ బోతోంది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ భేటీలో పైన చెప్పుకున్న సమస్యలతో పాటు ఫైటర్స్ యూనియన్ ఫెడరేషన్ సమస్యలు.. నటీనటుల రెమ్యూనరేషన్ లపై కూడా చర్చ జరపనున్నారట. మరి ఈ నెల 21న జరగనున్న నిర్మాతల మండలి కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చూడాలి.