తమిళ యువ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ .. విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండే పాత్రలు, వాళ్ళ జీవితాలను తెరపై చర్చించే సినిమాలు చూస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అంతే కాకుండా కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లోనూ నటించారు.
అంతే కాకుండా ధనుష్ ఇటీవల ఏకంగా అవెంజర్స్ దర్శకులతో కలిసి ది గ్రె మ్యాన్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో అతనికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కలేదు అనే మాట వాస్తవం. ఏదో అనుకుంటే ఇంకేదో తరహాలో కేవలం రెండు ఫైట్లు రెండు డైలాగులు పరిమితం అయింది ఆయన పాత్ర.
కానీ హాలీవుడ్ వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇది ఒక విధంగా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు దారి ఇచ్చినట్లే అని చెప్పవచ్చు.ఇపుడు ధనుష్ దృష్టి తెలుగు సినీ పరిశ్రమ పై పడింది.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుష్. దాంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ గురించిన వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ టేబుల్ వద్ద కూర్చుని చీకట్లో లాంప్ వెలుతురులో ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అది అల్లరి మూకల పైన ఫిర్యాదు పత్రం అయి ఉంటుందా లేక ఏదైనా బలమైన సంఘటనకు సంబంధించిన కవిత్వం లేదా విప్లవ నినాదం అయి ఉంటుందా అని ఆ పోస్టర్ చూసిన ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక ఈ చిత్రం తాలూకు టీజర్ ను రేపు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
తెలుగులో ‘సార్’ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం తమిళంలో మాత్రం ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమని సాయి సౌందర్య నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.