తమిళ దర్శకుడు లింగుస్వామి మొదటి సారిగా తెరకెక్కించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా “ది వారియర్” ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హీరో రామ్ పోతినేని నటిస్తున్న ఈ సినిమాలో , కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం జూలై 14న రాబోతోన్న సందర్భంగా ఆదివారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. హీరో రామ్ ను ఆకాశానికి ఎత్తేశారు. డైరెక్టర్ చెప్పింది చేసే ఆర్టిస్ట్ గా రామ్ ను పేర్కొంటూ, అలాంటి హీరో తో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే రామ్ కు భయంకరమైన టైం సెన్స్ ఉందని.. డ్యాన్సులు, ఫైట్లు అన్నీ అద్భుతంగా చేశారని కొనియాడారు. భవిష్యత్తులో రామ్ తో మరిన్ని సినిమాలు చేయాలని ఉన్న ఆశను తెలియజేస్తూ..ది వారియర్ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతుంది అని తెలిపారు .
మరి ఈ ప్రకటన కేవలం సినిమా విడుదల సందర్భంగా కేవలం ప్రచారం కోసం చేశారా లేక నిజంగానే సీక్వెల్ వస్తుందా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ హవా నడుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని నైజాం మరియు ఉత్తరాంధ్ర ఏరియాల్లో హీరో రామ్ ఏ స్వయంగా విడుదల చేస్తున్నారు అంటే సినిమా విజయం పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో దర్శకుడు లింగుస్వామి హీరోయిన్ కృతి శెట్టిని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఆమెను తను ముందు కాస్త తక్కువగా అంచనా వేశానని, కానీ ఆమె ఇంతలా పర్ఫామెన్స్ చేయడంతో షాక్ అయ్యానని చెప్పారు. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ గత పది రోజులుగా రాత్రింబవళ్ళు ఈ సినిమా కోసం పని చేశారని చెప్పిన లింగుస్వామి. హీరో రామ్ ది.. దేవిశ్రీ ది సేమ్ ఎనర్జీ అని చెప్తూ ఆయనతో ఎన్ని సినిమాలైనా సరే చేయాలని ఉందని కూడా చెప్పారు. “ఇది నా మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా. రన్, పందెంకోడి, ఆవారా అందరూ చూసి ఉంటారు. నాకు ఇది కరెక్ట్ ఎంట్రీ సినిమా. అందరికీ ఈచిత్రం నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు” అని లింగుస్వామి అన్నారు.