మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తయారు అయింది తెలుగు రాష్ట్రాలలో ఎక్జీబిటర్ల పరిస్థితి. అసలే ఓటిటి విప్లవం వల్ల ప్రేక్షకులకి థియేటర్లలో సినిమా చూసే అలవాటు తగ్గింది అని ఒక పక్క బాధ పడుతుంటే ఇప్పుడు వారిని మరో సమస్య చుట్టుముట్టింది.
గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వర్షాలు పడటం వేరు.. ఒక సమయం లో పడి మరి కాసేపు ఆగితే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. అయితే ముందుగానే చెప్పుకున్నట్టు గత కొన్ని రోజులుగా ఎడాపెడా కురుస్తున్న వర్షాలకు అన్ని వర్గాల వారూ కాస్త దెబ్బతిన్న మాట వాస్తవం. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమకు కొత్తగా ఈ వర్షాల బెడద పట్టుకుంది.
ఓటిటిలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడటం ఒక సమస్య అయితే, గత కొన్ని నెలలుగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలు మూడు నాలుగు వారాల్లోనే ఓటిటి లో విడుదల అవడం వలన థియేటర్ల వ్యవస్థ కుంటుపడే స్థితికి వచ్చింది.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం వర్షాలు శుక్రవారం వరకూ కోనసాగుతాయని తెలుస్తుంది. ఈ వారం రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్లో వస్తున్న ది వారియర్.. మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న గార్గి చిత్రాలు విడుదల అవుతున్నాయి. మరి ఆ సమయానికి వర్షాలు కాస్త తగ్గి ఆ చిత్రాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా థియేటర్లలో ప్రదర్శింప బడతాయో లేక అప్పటికీ ఇలాగే ముప్పేట దాడి చేస్తాయో చూడాలి.