అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ సినిమాను “మనం” సినిమా ఫేం దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో .. చైతన్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మళ్ళీ అలాంటి అద్భుతమైన సినిమా అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని అభిమానులు.ఈ సినిమాలో నాగ చైతన్య మూడు గెటప్ లలో ప్రేక్షకులను అలరించనున్నారు.
కాగా హీరో జీవితంలో యవ్వన దశ నుంచి ఒక పరిపూర్ణ యువకుడిగా ఎదిగే క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నాడు. చివరికి వాటి వల్ల ఏ రకంగా తన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాడు అనే కథగా ఈ సినిమా ఉండబోతుంది.
ఇది వరకే రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ చూస్తుంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ఉండే సినిమాలా అనిపిస్తుంది “థాంక్యూ”. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్ అనుకున్నా దాని కంటే గంట సేపు ఆలస్యంగా వచ్చింది. ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే.. “మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే, మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు” అన్న డైలాగ్ తో మొదలై..” ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే స్వేచ్చగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది” అన్న డైలాగ్ తో ముగుస్తుంది. ఈ మధ్యలో.. ముందుగానే చెప్పుకున్నట్టు సినిమాలో హీరో జీవితాన్ని మూడు దశలుగా చూపిస్తూ సాగుతుంది. మొత్తంగా ఒక భావోద్వేగమైన ప్రయాణంగా కనిపిస్తున్న ఈ ట్రైలర్ లో టచ్ చేసిన అంశాలు చూస్తే మహేష్ బాబు నటించిన మహర్షి, నాగ చైతన్య నటించిన మజిలీ చిత్రాలను గుర్తు తెచ్చింది అని చెప్పవచ్చు.
అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అందాల భామ రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే మంచి సక్సెస్ మీద ఉన్న థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.