యువ సామ్రాట్ అక్కికేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
అయితే ఇటీవలే తెలుగు సినిమా ప్రచార పద్ధతుల్లో ఒక కొత్త ఒరవడి మొదలుపెట్టారు సినీ వర్గాలు. అదేంటంటే మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. దయచేసి సినిమా చూడండి అని ప్రచారం చేయడం. కరోనా దాడుల తరవాత సినిమాలు మళ్ళీ యధావిధిగా విడుదల అవుతున్న నేపథ్యంలో అత్యాశకు పోయి టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువగా రేట్లు పెంచారు.
ఇప్పుడు చేసిన తప్పుకు పరిహారంగా, సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లను తగ్గించిన విషయాన్ని ప్రచార సాధనంగా ఉపయోగించు కుంటున్నారు.
ఈ నెలలోనే విడుదలైన పక్కా కమర్షియల్ మరియు హ్యాపీ బర్త్ డే చిత్రాలకు కూడా ఈ విధంగా ప్రకటించారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా పేరుకే టికెట్ రేట్లు తగ్గించారు అని చెప్పారు కానీ కేవలం 50 రూపాయల వరకే తగ్గించారు.
ఇప్పుడు “థాంక్యూ” సినిమాకి కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. చిత్ర యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం సింగిల్ స్క్రీన్ – 100(ఎక్సీఎల్ GST) గానూ మల్టీప్లెక్స్ – 150( excl GST) గానూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రేట్లు నిజంగా అమలు అవడం కష్టమే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని సినిమాలకు సింగిల్ స్క్రీన్ లకు దాదాపు 150/- .. మల్టీప్లెక్స్ లకు 180/- ఫిక్స్డ్ రేట్లు అమలులో ఉంటున్నాయి. అంతకంటే అవసరం అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటొచ్చీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చిన్న పిల్లల ఆటకు మాదిరి ఒక్కో సినిమాకి ఎక్కువ తక్కువ అంటూ సిల్లీగా వ్యవహరిస్తున్నారు.