68వ జాతీయ అవార్డులు (National Awards) కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఈ అవార్డులలో దక్షిణాది సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో ఎంపికవగా, అల వైకుంఠపురములో చిత్రానికి సంగీతం అందించిన తమన్ కు జాతీయ అవార్డు దక్కడం విశేషం.
ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ చిత్రం జాతీయ వార్డు కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో వర్ధమాన నటుడు సుహాస్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. చాయ్ బిస్కెట్ ఫేం సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. కాగా స్టీఫెన్ శంకర్ గా పేరు గాంచిన సాయి రాజేష్ కథను అందించారు.
ఇక సంగీత దర్శకుడిగా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న థమన్ ఏకంగా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్నారు. అయితే ఈ అవార్డు ఆయన అందించిన పాటలకు దక్కింది అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా మారు మ్రోగిన విషయం తెలిసిందే. ఇక సంగీతంలో ఉత్తమ నేపథ్య సంగీతానికి (background score) గానూ సూర్య ఆకాశం నీ హద్దురా (Soorarai Potru) చిత్రానికి సంగీత దర్శకుడు జీ వీ ప్రకాష్ అవార్డు సొంతం చేసుకున్నారు.
అలా వైకుంఠపురములో పాటలు ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. సామజవరగమన, బుట్ట బొమ్మ మరియు రాములో రాములా లాంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ అవార్డు తమన్ కి దక్కడం ఆయనకే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులందరికీ గర్వ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాగే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సంధ్యా రాజు(నాట్యం సినిమా) కు దక్కింది. ఉత్తమ మేకప్ మెన్ గా రాంబాబు (నాట్యం) ఇక ఉత్తమ నటులుగా హీరో సూర్య, అజయ్ దేవగన్ లకు అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, 2020 ఏడాదికి గాను ఈ పురస్కారాలను అందించింది కేంద్ర ప్రభుత్వం.