సహజమైన నటనతో, వైవిద్యభరితమైన పాత్రలతో, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సాయి పల్లవి. వెండితెరపై తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ షో తో కాకుండా, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సాయి పల్లవి.
ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అయినా తన నటనకు మాత్రం ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించారు. సాయి పల్లవి తాజాగా “గార్గి” చిత్రంలో నటించారు. తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో వహించిన ఈ కోర్టు డ్రామా ఈ శుక్రవారం విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. అలాగే తమిళ భాషలో సూర్య – జ్యోతిక సమర్పిస్తున్నారు.
గార్గి సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో తమిళనాడులో విలేఖరుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఆ షో చూసిన విమర్శకులు, సినీ విలేఖరులు సినిమాని, సాయి పల్లవి నటనను ఆకాశానికి ఎత్తేశారు.ఇది ఒక అద్భుతమైన సినిమా అని, ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందని పేర్కొన్నారు.
ఈ ప్రీమియర్ షో టాక్ మరియు రెస్పాన్స్ వచ్చినట్టు రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా సినిమాని మెచ్చుకుంటే ఇంక సాయి పల్లవి ఖాతాలో మరో సూపర్ హిట్ చేరినట్టే. మరి ఆ ఊహ నిజం అవ్వాలని, సాయి పల్లవి మరో సూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.