తెలుగులో ఒక హీరో స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రెండు వారాల ముందు మరోసారి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ముందు నుంచి సినిమాకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, సినిమా ట్రైలర్ విడుదల చేశాక ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తి పెరిగింది.
అలాగే రిలీజ్ కు ముందు రోజు సినిమాకు ప్రివ్యూలు వేసారు. ఆ ప్రీమియర్ షో చూసిన విమర్శకులు మరియ మీడియా సినిమాకి చాలా మంచి టాక్ చెప్పారు. ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రివ్యూలు బాగానే వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీసు వద్ద సందడి మాత్రం అనుకున్నంత లేదు. కోర్ట్ రూమ్ డ్రామా, మరియు ఒక సున్నితమైన అంశంతో తెరకెక్కిన గార్గి సినిమా ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. ఇక కలేక్షన్ల పరంగానూ పరవాలేదు అనిపించుకుందీ చిత్రం.
సాయి పల్లవి నటనకు అద్భుత స్పందన లభించగా, సహాయక పాత్రలో నటించిన కాళి వెంకట్ నటనను కూడా పొగడ్తలతో ముంచెత్తారు విమర్శకులు మరియు ప్రేక్షకులు. అయితే ముందుగానే చెప్పుకున్నట్టు మనసు తట్టుకోలేని విధంగా ఉన్న కథా వస్తువు వల్ల ఈ చిత్రం జనరంజకమైన సినిమాగా ఆదరణ పొందలేకపోయింది. ఒక్కోసారి ఇలాంటి సినిమాలు రావాలి, సమాజంలో జరుగుతున్న ఘోర నేరాలను ప్రశ్నించాలి. కాబట్టి ఇతర సినిమాల లాగా కమర్షియల్ సూత్రాలలో ఈ చిత్రాన్ని కొలవడం సబబు కాదు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడనే చర్చ కాస్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదల అవుతున్నపుడే ఏ ఓటీటి యాప్ లో వస్తుంది అని ఆలోచించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ వార్తలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే ప్రేక్షకులు ఓటిటి రిలీజ్ కూడా ఒక విశేషమైన వార్త లాగా చూస్తారు.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం గార్గి సినిమా వచ్చే వారం అంటే ఆగస్ట్ రెండో తారీఖు నుంచి సోనీ లైవ్ (sony liv) లో స్ట్రీమ్ అవబోతుందని తెలిసింది. మరి ఓటిటి విడుదల తరువాత సాయి పల్లవికి, ఆవిడ సినిమాకి ఇంకెంత ఆదరణ లభిస్తుందో చూద్దాం.